Brand new Course Package released! Get 30% off your first purchase with code “Eduma”. Find out more!

రంగారెడ్డి జిల్లా: బస్సుపైకి దూసుకెళ్లిన కంకర టిప్పర్, 19 మంది మృతి, ప్రమాదానికి అసలు కారణమేంటి?

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో 19 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 72 మంది ఉన్నారని వారు వెల్లడించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్… ఇద్దరూ మరణించారు.

బస్సుని ఢీ కొట్టి టిప్పర్ లోపలకు దూసుకెళ్లింది. అందులో ఉన్న కంకరలో చాలా భాగం బస్సులో పడటంతో సగం బస్సు రాళ్లతో నిండిపోయింది. కొంతమంది ప్రయాణికులు బస్సులో సీట్ల మధ్య ఇరుక్కుపోయారు.

బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని బయటకు తీసి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలి నుంచి వెలికితీసిన మృత దేహాలను కూడా ఆసుపత్రికి తరలించారు.

సంఘటన జరిగిన ప్రాంతం భయానకంగా ఉంది.

చనిపోయిన వారిలో ఓ పసికందు సహా 14 మంది మహిళలు, ఐదుగురు పురుషులు, ఉన్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చెప్పారు.

ఇప్పటిదాకా 15 మంది పోస్టుమార్టం పూర్తి చేసి, మృతదేహాలను బంధువులకు అప్పగించామని తెలిపారు. మిగిలిన నాలుగు మృతదేహాలలో ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందని ఆయన చెప్పారు. గాయపడిన 14మంది పరిస్థితి నిలకడగానే ఉందని, వారికి చికిత్స అందుతోందన్నారు. ఒకరికి తుంటి వద్ద గాయమైందని, మెరుగైన చికిత్సకోసం పంపుతామని తెలిపారు.

ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని ప్రమాదానికి గల కారణాలు త్వరలో తెలుస్తాయని వెల్లడించారు మృతుల కుటుంబాలకు 7 లక్షల రూపాయల నష్టపరిహారం, అలాగే గాయపడిన వాళ్లకి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున అందిస్తున్నట్టుగా చెప్పారు

బస్సులో 72 మంది ఉన్నట్లు తెలంగాణ ఏడీజీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు.

టిప్పర్ బస్సుపై పడటంతో , బస్సు లోపల చిక్కుకున్న వారిని బయటకు తీయడం కష్టంగా మారింది.

జేసీబీల సాయంతో టిప్పర్‌ను పక్కకు జరిపేందుకు చేసిన ప్రయత్నంలో ఓ పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడటంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.

బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

ఆప్తుల్ని కోల్పోయిన వారి రోదనలో ఆసుపత్రి ప్రాంతంలో విషాదకర వాతావరణం ఏర్పడింది.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్​ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని అధికారులకు సూచించారు.

గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్​కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి, డీజీపీలకూ, అందుబాటులో ఉన్న వారంతా వెంటనే ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకోవాలని మంత్రులకూ సూచించారు సీఎం.

ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర వైద్య సాయంతో పాటు, తగినన్ని అంబులెన్స్​లు, వైద్య సిబ్బందిని రంగంలోకి దింపాలని సీఎం ఆదేశించారు.

ప్రమాదంలో గాయపడి చేవెళ్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు.

గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

ఆసుపత్రి వద్దకు పరామర్శకు వచ్చిన నేతల్ని మృతుల బంధువులు నిలదీస్తున్నారు. రోడ్డు విస్తరణను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగ్రాతులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు ట్వీట్ చేశారు.

ప్రమాదానికి కారణమేంటి?

చేవెళ్ల వైపు నుంచి భారీ కంకరలోడుతో వస్తున్న టిప్పర్, తాండూరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు (టీఎస్ 34, టీఏ 6354)ను ఢీకొంది.

ఉదయం 6.30గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా అగ్నిమాపక అధికారులు, పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఈ ప్రమాదంలో బస్సు నామరూపాల్లేకుండా ధ్వంసమైంది. బస్సు ధ్వంసమైన తీరు ప్రమాద తీవ్రతను చూపుతోంది.

కంకరలోడంతా బస్సులో పడటంతో, ప్రయాణికులు కంకరమధ్య చిక్కుకుపోయి ఊపిరాడక అల్లాడిపోయారు.

బస్సు భాగాలు దూరంగా ఉన్న పొలాల్లో కూడా పడటం ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో తెలుపుతోంది.

మరోపక్క టిప్పర్ ముందుభాగం మొత్తం నుజ్జునుజ్జు అయిపోయింది. టిప్పర్ డ్రైవర్ చనిపోయారు.

టిప్పర్ బస్సులోకి దూసుకుపోవడంతో, టిప్పర్‌ను తీసేందుకు జేసీబీలతో శ్రమించాల్సి వచ్చింది.

చేవేళ్ల, వికారాబాద్ రహదారి ఇరుకుగా ఉంటుంది. ఇది బీజాపూర్ హైవేలో భాగంగా ఉంది.

ప్రాథమికంగా ఈ ప్రమాదానికి కారణం రోడ్డుపై ఉన్న గుంతేనని పోలీసు అధికారులు, అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న టిప్పర్ లారీ గుంతను తప్పించబోయి కుడివైపు‌కు తిరగడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టినట్టు చెబుతున్నారు.

అయితే ఆ సమయంలో ఈ రెండువాహనాలు ఎంత వేగంతో ఉన్నాయనే విషయాన్ని అధికారులు ధృవీకరించలేకపోతున్నారు

Tags:

Share:

Book Your Seat

Please enable JavaScript in your browser to complete this form.

Book Your Seat Now!

Please enable JavaScript in your browser to complete this form.